మీ జీవితానికి మీరే యజమానులు
ఆ గుహ చాలా చిన్నది. బయట ప్రపంచపు చప్పుళ్లు అంతగా వినిపించవు. లోపల ఒక చిన్న మంట మెల్లగా వెలుగుతోంది. ఆ వెలుగులో ముడుచుకుని కూర్చున్నాడు ఒక యోగి. అతడి కళ్లు మూసుకుని ఉన్నా, ముఖంలో ఏదో వెలితి కనిపిస్తోంది. గతం ఒక నల్లని నీడలా అతడి మనసును కమ్ముకుంటూ ఉంటుంది. మనుషులతో అతడు పడిన బాధలు ఒకదాని తర్వాత ఒకటిగా గుర్తుకు వస్తున్నాయి. చిన్నప్పుడు స్నేహితులు వెక్కిరించిన రోజులు... కాలేజీలో ప్రేమించిన అమ్మాయి మోసం చేసిన క్షణాలు... ఉద్యోగంలో పై అధికారి నిందించిన సందర్భాలు... బంధువులు అవమానించిన తీరు... అన్నీ అతడి కళ్లముందు కదులుతున్నాయి. ప్రతిసారి ఎవరో ఒకరు దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేసి "నీకు నేనున్నా" అన్నారు. ఆ మాటల్లోని నిజాయితీని నమ్మి ఆశపడ్డాడు. కానీ ప్రతిసారీ అది ఒక భ్రమగానే మిగిలిపోయింది. ఆ "నేనున్నా" అనే మాట వెనుక ఒక స్వార్థం దాగి ఉండేది. అతడి బలహీనతలను ఆసరాగా చేసుకుని తమ గొప్పను చాటుకునే ప్రయత్నం చేసేవారు. అతడికి ఏమీ తెలియదని నిరూపించడానికి పోటీ పడేవారు. అతడి మనసులోని సున్నితమైన భావాలతో ఆటలాడుకునేవారు. ప్రేమను, నమ్మకాన్ని మనుషుల ద్వారా పొందుదామని ఆశించడం అతడి...